పిల్లలకు మార్కులు తగ్గితే టీచర్లకు జరిమానా
- విద్యార్థులను కొడితే ఉపాధ్యాయునికి జైలు!
- విద్యాహక్కు చట్టానికి సవరణ జీవో 130 జారీ
పిల్లల సామర్ధ్యం నిర్దేశించినదానికంటె తగ్గితే అంటే వారికి మార్కులు తగ్గితే టీచర్లకు జరిమానాలు విధించాలని,క్రమశిక్షణాచర్యలు తీసుకోవాలనీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రాథమిక విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి చందనా ఖాన్ శుక్రవారం విద్యా హక్కు చట్టంలోని కొన్ని నిబంధనలను సవరించి, 130 నెంబర్ జిఓను జారీ చేశారు. ఆ ఉత్తర్వుల ప్రకారం....ఏడాదిలో స్టేట్ అకడమిక్ అథారిటీ రూపొందించిన ప్రమాణాలలో విద్యార్థుల పనితీరు (పెర్ఫార్మెన్స్) 60 శాతం కంటె తక్కువయితే ఆ ఉపాధ్యాయునికి జరిమానా విధించే అంశం పరిశీలిస్తారు. స్థానిక సంస్థలు ఆ మేరకు సిఫారసు చేస్తే సంబందిత నియామకాధికారి చర్యలు తీసుకుంటారు. అయితే ప్రమాణాల్లో విద్యార్థుల సామర్థ్యం 90 శాతం కన్నా ఎక్కువగా ఉండి, స్థానిక సంస్థల నుంచి ఆ ఉపాధ్యాయునిపై ఫిర్యాదులు రాకపోతే, అలాంటి వారిని స్థానిక సంస్థల సిఫార్సుతోనే ఉత్తమ ఉపాధ్యాయులుగా జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఎంపిక చేయాలని పేర్కొన్నారు. అలాగే పిల్లలను కొట్టినా మానసిక వేధింపులకు గురిచేసినా ఇండియన్ పీనల్ కోడ్ (ఐపిసి) 323 సెక్షన్ ప్రకారం టీచర్లను శిక్షిస్తారు. దాని ప్రకారం కోర్టు ఉపాధ్యాయునికి ఏడాది జైలు, వెయ్యి రూపాయల వరకు జరిమానా విధించవచ్చు.
పిల్లల సామర్థ్యం బోధనపైనే ఆధారపడదు : యుటిఎఫ్
పిల్లల సామర్థ్యం ఉపాధ్యాయుల బోధనపైనే ఆధారపడి ఉండబోదని యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ పేర్కొంది. ఆర్థిక, సామాజిక నేపథ్యం, స్థానిక పరిస్థితులు కూడా విద్యార్థుల సామర్థ్యంపై ప్రభావం చూపిస్తాయని తెలిపింది.ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలని, జరిమానా విధించాలని ఉత్తర్వులు జారీ చేయడం సరికాదని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ రవి ప్రజాశక్తితో చెప్పారు. ఇది ఉపాధ్యాయులను స్థానిక రాజకీయాల్లో బలి పశువులను చేయడమేనన్నారు. ఆ నిబంధనను తీవ్రంగా ఖండిస్తున్నామని, అభ్యంతరం చెప్తున్నామని తెలిపారు. కాగా జీవోలో విద్యార్థులకు, తల్లిదండ్రులకు కలిగే సమస్యలపై ఫిర్యాదులు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కమిటీలను నియమించింది. ఫిర్యాదుల విచారణకు మండల స్థాయిలో ఎంపిపి ఛైర్మన్‌గా, ఎంపిడివో సభ్యునిగా, ఎంఇవో కన్వీనర్‌గా కమిటీ నియమించింది. జడ్పీ ఛైర్‌పర్సన్ జిల్లా స్థాయి ఫిర్యాదుల కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. కలెక్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారిగా, డిఇవో మెంబర్ కన్వీనర్‌గా వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు సభ్యులుగా ఉంటారు. రాష్ట్ర స్థాయి ఫిర్యాదుల కమిటీలో ప్రాథమిక, మాధ్యమిక విద్యాశాఖ ముఖ్యకార్యదర్శులు, రాజీవ్ విద్యామిషన్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఉంటారు. స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (ఎస్‌ఎంసి)లో తల్లిదండ్రులను భాగస్వాములను చేశారు. ఆయా పాఠశాలల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆరుగురు సభ్యులు ఉంటారు. సాధారణ కేటగిరీ నుంచి ఇద్దరు, ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ కేటగిరీల నుంచి ఒక్కొక్కరుగా సభ్యులుగా ఉంటారు. కమిటీలో 50 శాతం మంది సభ్యులు మహిళలుండాలి. ఎన్జీవో ప్రతినిధి, ఎఎన్‌ఎం, మహిళా సమతా సొసైటీ నుంచి ఒకరు ఎస్‌ఎంసిలో ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి